థాయ్‌లాండ్ మరియు కంబోడియా మధ్య సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. రెండు దేశాల సైనికుల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఆరు ప్రాంతాల్లో జరిగిన ఈ ఘటనల్లో ఓ సైనికుడితో పాటు మొత్తం 16 మంది మృతి చెందారు. బుధవారం జరిగిన మందుపాతర పేలుడు ఈ ఉద్రిక్తతలకు నాంది పలికినట్టు తెలుస్తోంది. ఐదుగురు థాయ్ సైనికులు ఈ పేలుడులో గాయపడ్డారు.
ఈ పేలుడుకు కంబోడియా పాలుపంచుకుందని థాయ్‌లాండ్ ఆరోపించగా, ఆ ఆరోపణను కంబోడియా ఖండించింది. గతంలో అమర్చిన మందుపాతర అయి ఉండవచ్చని తాము దీనితో సంబంధం లేదని స్పష్టం చేసింది.
ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారత్ అప్రమత్తమైంది. థాయ్‌లాండ్‌లోని ఇండియన్ ఎంబసీ భారత పౌరుల కోసం ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఉబోన్ రాట్చథాని, సురిన్, సిసాకెట్, బురిరామ్, సా కాయో, చంతబురి, ట్రాట్ ప్రావిన్స్‌లకు వెళ్లకూడదని హెచ్చరించింది.
ఇరు దేశాల సైనికులు శుక్రవారం తెల్లవారుజామున కూడా ఘర్షణకు దిగినట్టు సమాచారం. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.